PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష..

1 min read

పెండింగులో ఉన్న టెండర్ ప్రక్రియలన్ని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి..

జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి :  జిల్లాలో వివిధ శాఖల నిధుల ద్వారా మంజూరై ఇంకా ప్రారంభంకాని నిర్మాణాలకు సంబంధించి  మార్చి ,2వ తేదీలోగా  పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు.  స్థానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశపు హాలులో శనివారం వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో పనుల ప్రగతిపై కలెక్టర్  సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ  జిల్లాలో గ్రామ /వార్డ్ సచివాలయ భవనాలు, ఆర్బీకే , వెల్నెస్ సెంటర్ భవనాలు , తదితర నిర్మాణ పనులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వాటిలో 83 శాతం వరకు పూర్తి అయ్యాయని, మిగిలిన నిర్మాణాలు సంబంధించి పనులు వేగవంతం చేయాలన్నారు.  జిల్లాలో ఎన్నికల కోడ్ రానున్న దృష్ట్యా అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న  టెండర్ ప్రక్రియలన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు.   ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మంజూరైన పనులను చేపట్టవలసిన బాధ్యత సంబంధిత జిల్లా అధికారులపై ఉందన్నారు.  ఇప్పటివరకు టెండర్ పిలవని పనులకు ఈనెల 28వ తేదీలోగా టెండర్ ప్రక్రియలు పూర్తిచేయాలని, టెండర్ల ప్రక్రియ అనంతరం మార్చ్,1వ తేదీ లోగా పూర్తి చేసి, పనులను మార్చ్, 2వ తేదీ లోగా ప్రారంభించాలన్నారు.  నిర్మాణ పనులు పూర్తి ఐన భవనాలను ఈనెల 28వ తేదీ లోగా ప్రారంభించి, వినియోగంలోకి తీసుకురావాలన్నారు.  పూర్తి చేసిన పనులకు సంబంధించి బిల్లులను వెంటనే ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం లేదని ఇంజనీరింగ్ అధికారులపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఎప్పటికప్పుడు బిల్లులను ఆన్లైన్ లో అప్లోడ్  చేయాలన్నారు.  టెండర్ ప్రక్రియకు సంబంధించి ఈ ఈ, డీ ఈ ల స్థాయిలలో పెండింగ్ ఉన్న పనులను పూర్తి చేయించవలసిన బాధ్యత జిల్లా స్థాయి సూపరింటెండింగ్ ఇంజనీర్ లపై ఉందన్నారు.  సమావేశంలో ఐ టి డి ఏ  ప్రాజెక్ట్ అధికారి ఎం. సూర్యతేజ, గృహ నిర్మాణ సంస్థ పీడీ కె.వి. రవికుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శర్మిష్ఠ, డీ ఈ ఓ అబ్రహం,  పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్., రోడ్లు భవనాల శాఖ సూపెరింటెండింగ్ ఇంజినీర్లు కేదారేశ్వరరావు, సత్యనారాయణ, జాన్  మోషే,  ఐసి డిఎస్ పీడీ పద్మావతి, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author