PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రహదారుల్లో పెండింగ్.. పనులను త్వరితగతిన పూర్తి చేయండి

1 min read

జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రహదారుల్లో పెండింగ్ ఉన్న త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ రహదారుల్లో పెండింగ్ ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను డిఆర్ఓ ఆదేశించారు. ఎన్హెచ్ 40 రహదారిలోని అండర్ పాస్, జగనన్న హౌసింగ్ కాలనీకి సర్వీస్ రోడ్ గురించి ఎన్హెచ్ 40 అధికారులను అడుగగా ఎన్హెచ్, రవాణా అధికారులతో కలిసి జాయింట్ సర్వే చేసి అండర్ పాస్ కల్పించడం కుదరదని అందుకు ప్రత్యామ్నాయ మార్గానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర ట్రాఫిక్ నియంత్రణ కోసం అండర్ పాస్ నిర్మాణం గురించి అడుగగా సంబంధిత అధికారి స్పందిస్తూ అదనపు వార్షిక ప్లాన్ లో అండర్ పాస్ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. బళ్లారి చౌరస్తా నుండి రాజ్ విహార్ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండే అంశంపై మున్సిపల్ అధికారులను అడుగగా మాస్టర్ ప్లాన్ తయారు చేసామని అప్రూవల్ కొరకు ఉన్నతాధికారులకు పంపడం జరిగిందన్నారు. నగరంలో పలుచోట్ల బస్సు షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నారని వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశించారు. అదే విధంగా హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి పెండింగ్ ఉన్న వాటిని కమిటీ దృష్టికి తీసుకొని వస్తే పరిశీలించి బాధితులకు నష్టపరిహారం అందజేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అధికారి వెల్లడించారు.రవాణా శాఖ డిప్యూటీ కమీషనర్ మాట్లాడుతూ గతంలో హిట్ అండ్ రన్ కేసులకు విచారణ నిర్వహించే కమిటీలో జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా, డిఎస్పి మెంబర్ గా, తహశీల్దార్లు ఉండే వారని, కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన జిఓఎంఎస్.93 ప్రకారం కమిటీలో జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా, జిల్లా ఎస్పీ మెంబర్, సబ్ డివిజనల్ ఆఫీసర్లు మెంబర్లు గా ఉంటారని వారితో పాటు భీమా సంస్థకు చెందిన వారు మెంబర్ సెక్రెటరీ గా ఉండడం వల్ల బాధితులకు త్వరితగతిన నష్టపరిహారం అందజేసే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం 2023 డిసెంబరు నెలలో జరిగిన రోడ్డు ప్రమాదాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.సమావేశంలో రవాణా శాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీధర్, పంచాయతీ రాజ్ ఎస్ఈ సుబ్రమణ్యం, ఆర్ అండ్ బీ ఎస్ఈ నాగరాజు, ఆర్టిఓ రమేష్, డిప్యూటీ డెమో భాస్కర్, ఆర్టీసి అధికారులు, మున్సిపల్ సిబ్బంది, నేషనల్ హైవే కర్నూలు, అనంతపురం జిల్లాలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author