PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సామాన్యుడికి కూర’గాయాలు’..!

1 min read

మార్కెట్లో మండిపోతున్న ధరలు..

సెంచరీ దాటిన టమాటో..

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: కూరగాయలు సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతున్నాయి. వారాలు గడుస్తున్నా ధరలు మాత్రం దిగిరావడం లేదు. దీంతో వినియోగదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. టమాటా కొనలేకపోతున్నారు.. ఉల్లి ధర ఘాటుకి భయపడుతున్నారు. తక్కువలో తక్కువ ఐదు వందలు పట్టుకెళ్తేనే  రెండ్రోజలకు సరిపడా కూరగాయలు కొనగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

కిలో టమోటా…రూ.100

నందికొట్కూరు మున్సిపాలిటీ లోని కూరగాయల మార్కెట్ లో సోమవారం  ధరలు ఆకాశాన్నంటాయి. ఉల్లి పాయలు, టమోటాలు సామాన్యుడికి అందుబాటులో లేవు. రెండువారాల క్రితం వరకూ కేజీ రూ.20–25 ఉన్న ఉల్లిపాయల ధరలు రూ.50లకు చేరుకున్నాయి. టమోటాల పరిస్థితి కూడా అంతే. రూ.20లోపు ఉన్న టమోటాలు ఒక్క సారిగా రూ.100 లకు చేరుకున్నాయి. వంకాయలు ధరలు అమాంతంగా పెరిగి పోయి కేజీ రూ.80 వరకు అమ్ముతున్నారు. చిక్కుడు కాయలు కేజీ రూ.60–70 వరకూ పలుకుతోంది. బీరకాయలు రూ.60 రూపాయలు పైమాటే. అక్టోబరులో గులాబ్‌ తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు కురవడం, ఆ తర్వాత కూడా వర్షాలు ముంచెత్తడంతో కూర గాయల పంటలు దెబ్బతిన్నాయి. అనంతరం కొత్త పంటలు వేశారు. ఈ పంటలన్నీ డిసెంబరు , జనవరిలో  అందుబాటులోకి వస్తాయి. అప్పటి వరకూ కూరగాయల ధరలు సామాన్యులకు అందు బాటులో ఉండే పరిస్థితులు కన బడడం లేదు.

ధరల పెరుగుదలకు.. కారణాలివే…!

మహారాష్ట్రలో భారీ వర్షాలు కారణంగా ఉల్లి పంట దెబ్బ తింది. ఫలితంగా ఉల్లి ఘాటెక్కింది. పెట్రోలు, డీజీల్‌ ధరలు పెరగ డం వల్ల రవాణా ఖర్చులు ఎక్కువయ్యాయి. క్యారెట్‌, బీట్‌రూట్‌, క్యాప్సికం హైదరాబాద్‌ నుంచి దిగుమతి అవుతాయి. అయితే హైదరాబాదు పరిసర ప్రాంతాలను ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తాయి. దీనితో పంటలు దెబ్బతిని వీటి ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. నిన్న మొన్నటి వరకూ పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, వంట నూనెల ధరలు ప్రతి రోజూ పెరుగుతూ బెంబేలెత్తిస్తే, ఇప్పుడు కూరగాయల వంతు అన్నట్టు అడ్డూ అదుపూలేకుండా పెరుగుతూ ప్రజలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో అన్ని కూరగాయల ధరలు పెరిగినట్టు రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. దీనికితోడు కార్తీకమాసం ప్రారంభం కావడంతో వినియోగం పెరిగి ధరల విజృంభణకు మరో కారణంగా కనిపిస్తోంది. అసలే చిన్నచిన్న ఉద్యోగాలు, చాలీచాలని వేతనాలతో జీవనం సాగించే కుటుంబాలు తాము ఏం తిని బతకాలంటూ ఆందోళన చెందుతున్నా యి. మరికొన్నాళ్లు కూరగాయల ధరల పెరుగుదల ఇదే విధంగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.ఈ కారణంగా ధరలు మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ రెండు నెలలు ఈ ధరలను ప్రజ లు భరించాల్సిందేనని వ్యాపారులు పేర్కొంటున్నారు.

About Author