PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర ఖజానాలో జగన్ తన తాబేదారులకు బదిలీ చేశారని ఆరోపణ

1 min read

జిల్లా టిడిపి అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు

వృద్ధుల పెన్షన్ సొమ్ములు ఇంటి వద్దనే అందించేలా చర్యలు తీసుకోవాలి

ఏలూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ఖజానాలోని సొమ్మంతా సీఎం జగన్‌ తన తాబేదారులకు బదిలీ చేసి, పెన్షన్లు పంపిణీ చేయకుండా టిడిపిపై, ప్రతిపక్షాలపై నిందలు మోపుతున్నారని టిడిపి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి దుయ్యబట్టారు. జగన్‌ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు పేదల జీవితాలతో ఆటలాడుతున్నారని వారు మండిపడ్డారు. వృద్ధులకు, దివ్యాంగులకు, ఇతర పెన్షన్‌దారులకు ఇంటివద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని, వాలంటీర్లకు బదులు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్లో జాయింట్‌ కలెక్టర్‌ లావణ్యవేణికి గన్ని వీరాంజనేయులు, బడేటి చంటి, ఇతర నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం గన్ని వీరాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో జాప్యానికి ముమ్మాటికి జగన్‌ చేతకానితనమే కారణమని, ఆయన అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు ఈ అంశాన్ని కూడా రాజకీయం చేసి ఎన్నికల్లో లబ్దిపొందాలని చూడడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ పెన్షన్ల పంపిణీకి వాలంటర్లను దూరం పెట్టాలని ఆదేశాలు జారీచేస్తే దానికి, టిడిపికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఖజానా ఖాళీ అయ్యిందన్న విషయాన్ని పక్కదారి పట్టించేందుకు జగన్మోహన్‌ రెడ్డి తన వికృత చేష్టలను ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. వాలంటీర్‌ వ్యవస్థకు టిడిపి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేస్తూ.. వ్యవస్థ దుర్వినియోగం కారాదన్నదే తమ ఆకాంక్షన్నారు. రాష్ట్రంలో సచివాలయాల్లో లక్షా 65వేల మంది ఉద్యోగులు ఉన్నారని, వారితో ఇళ్ళ వద్దే పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా ఎందుకు ఆ విధంగా చర్యలు చేపట్టడం లేదని ఆయన నిలదిశారు. అధికారులు తక్షణం చర్యలు తీసుకుని పెన్షన్‌దారులందరికి పెన్షన్లు అందేలా చూడాలన్నారు. ఏలూరు అసెంబ్లీ అభ్యర్ధి బడేటి చంటి మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాకా నిబంధనలను అతిక్రమించి తన అనుచరులకు సీఎం జగన్‌ 13వేల కోట్ల రూపాయలు దోచిపెట్టారని విమర్శించారు. అవ్వాతాతల పింఛన్ల విషయంలో జగన్‌ తన రాజకీయ వికృత చేష్టలకు తెరతీసి, టిడిపి, ప్రతిపక్షాలపై విషం జిమ్ముతున్నారని మండిపడ్డారు. పింఛన్ల జాప్యానికి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ఖరారు కావడంతో తన ఉక్రోషాన్ని ఈ విధంగా ప్రదర్శిస్తున్నారని బడేటి చంటి పేర్కొన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని నమ్ముకుంటే రానున్న రోజుల్లో పెన్షన్లు కూడా తీసేస్తారని, ఆ మొత్తాన్ని కూడా దోచుకుతింటారని ఆరోపించారు. ప్రజలపై భారం పడకుండా సంక్షేమాన్ని అమలు చేయాలన్నదే ఎన్డీఏ లక్ష్యమని, ఆ దిశగా తమ పాలన ఉంటుందని పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో వైసిపి నాయకుల తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటి మేయర్ చోడే వెంకటరత్నం, వందనాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

About Author