PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద పోలీసు బందోబస్తు..

1 min read

పల్లెవెలుగు వెబ్​ వెబ్​, నందికొట్కూరు : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకున్న జల వివాదం నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. శుక్రవారం నందికొట్కూరు రూరల్ సిఐ ప్రసాద్, పాణ్యం సిఐ జీవన్ బాబు, ముచ్చుమర్రి ఎస్ఐ శ్రీనివాసులు, జూపాడుబంగ్లా మండలం ఎస్ఐ వెంకట సుబ్బయ్య లు పోతిరెడ్డిపాడు విస్తరణ పనుల ప్రాంతాన్ని పరిశీలించారు. జిల్లా ఎస్పీ డా.కాగినెల్లి పక్కిరప్ప ఆదేశాలతో పోతిరెడ్డిపాడు వద్ద రెండు చెక్ పోస్టులను పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కంపెనీ గుర్తింపు కార్డులను కలిగిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ క్షుణంగా తనిఖీ నిర్వహించి అనుమతిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద గురువారం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోతిరెడ్డిపాడు వద్ద పోలీసు బలగాలు మోహరించారు.

ముదురుతున్న జల వివాదం..
తెలుగు రాష్ట్రాల జల వివాదం రోజురోజుకు ముదురుతూనే ఉంది. ఇరు రాష్ట్రాల మంత్రులు,అధికార పార్టీ నేతలు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. కృష్ణా నదిపై రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే ఏపీ ప్రాజెక్టులు కడుతోందని తెలంగాణ వాదిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఇదే క్రమంలో మరో వైపు ఈ వివాదంపై ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీ, జలశక్తి మంత్రి షెకావత్‌కు వేర్వేరు లేఖలు రాశారు. జల వివాదంపై తక్షణం కేంద్రం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని విద్యుత్ ఉత్పత్తికి వాడుకోవద్దన్న నిబంధనలు ఉన్నప్పటికీ తెలంగాణ అక్రమంగా వాడుకుంటోందని లేఖలో ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలుపదల చేయాల్సిందిగా ఆదేశాలివ్వాలని కోరారు. వ్యవసాయ అవసరాలు లేకపోయినా అక్రమంగా నీటిని వాడుకుంటూ కింది ప్రాంతాల హక్కులను కాలరాసేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ చర్యలతో రాయలసీమ,నెల్లూరు,ప్రకాశం ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తుతుందని పేర్కొన్నారు. కృష్ణా నదిపై రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని ప్రాజెక్టులకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ నేపధ్యంలో ప్రాజెక్టుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

About Author