PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తల్లి పులి కోసం అన్వేషణ..

1 min read

నాలుగో రోజైనా ఆచూకీ దొరికేనా..?

తల్లి పులి కోసం గాలిస్తున్న అటవీశాఖ సిబ్బంది..

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు:నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురంలో పెద్దపులి పిల్లలు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. నేషనల్ టైగర్ కన్సర్వే షన్అథారిటీ, స్టాండింగ్ఆపరేటింగ్ ప్రొసీజర్ నిపుణుల సూచనలతో  తల్లి పులి కోసం నాలుగో రోజు  గాలింపు కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో ప్రాజెక్ట్ టైగర్ ఎఫ్.డి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. పులి కూనలు ఆరోగ్యంగా ఉన్నాయి. ప్రత్యేక వైద్య బృందం పెద్ద పులి పిల్లల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. హుషారుగా ఉన్నాయి.. చక్కగా ఆడుకుంటున్నాయి. అలాగే ఇటు తల్లి పులి కోసం సెర్చ ఆపరేషన్ కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో కొన్ని అడుగుల్ని గుర్తించారు.. అలాగే ఇద్దరు పులి తమకు కనిపించిందని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కెమెరాలతో పాటూ అటవీశాఖ సిబ్బంది పులి కోసం గాలిస్తున్నారు. అవసరమైతే డ్రోన్‌ను ఉపయోగిస్తామంటున్నారు.

తల్లి పులికోసం అన్వేషణ.. దేశ చరిత్రలోనే తొలిసారి..

నంద్యాల జిల్లాలో నాలుగు పెద్దపులి పిల్లల తల్లి కోసం గాలింపు కొనసాగుతోంది. నాలుగు పిల్లల్ని తల్లి దగ్గరకు చేర్చేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం దేశ చరిత్రలోనే తొలిసారి అంటున్నారు. అయితే తల్లి గాలింపు ప్రయత్నంలో కీలక పరిణామం గురించి ఆపరేషన్‌ కమిటీ మెంబర్‌, డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ ఆప్పవ్ ఐఎఫ్‌ఎస్‌ వివరించారు. పెద్ద గుమ్మాడాపురం అటవీప్రాంతంలోపెద్ద పులి అడుగుజాడలను అటవీ శాఖ సిబ్బంది గుర్తించినట్లు తెలిపారు.

గొర్రెల కాపరులకు కనిపించిన తల్లి పులి..:

అది తల్లి పులి టి 108 వి అవునా? కాదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. అలాగే పెద్దగుమ్మడాపురానికి ఒకటిన్నర కి.మీ. దూరంలోని ముసలిమడుగు గ్రామ సమీపంలో సంగమేశ్వరం వెళ్లే బీటీ రహదారిపైకి పులి వస్తుండగా చూశామని ఓ గొర్రెల కాపరి, పండ్ల వ్యాపారి అటవీ సిబ్బందికి చెప్పారు. దీంతో ఎఫ్‌డీ శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకుని పాదముద్రల్ని పరిశీలించారు.

300మంది సిబ్బందితో గాలింపు..:

ఇదిలా ఉంటే 50కిపైగా అటవీ అధికారులతో మొత్తంగా 300 మంది సిబ్బందితో ఆపరేషన్‌ తల్లి పులి నిర్వహిస్తున్నామన్నారు అటవిశాఖ అధికారులు. తల్లి పులి అన్వేషణ కోసం శాస్త్రీయ సాంకేతికతను ఉపయోగిస్తున్నామన్నారు. మొత్తం 40 ట్రాప్ కెమెరా లతో ట్రేస్ చేస్తున్నామన్నారు. అవసరమైతే డ్రోన్ కూడా వినియోగిస్తామన్నారు.

పులి కూనలకు వైద్య పరీక్షలు..:

ఇటు ఆత్మకూరు మండలం బైర్లూటిలోని అటవీశాఖ గెస్ట్ హౌస్‌లో నాలుగు పులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయి. ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిపుణుల సూచనలతో పులికూనలకు పాలు, సెరోలాక్‌తో పాటు చికెన్ లివర్ ముక్కలను అందించారు. వాటి ఆరోగ్యం బాగానే ఉందని  హుషారుగా ఆడుకుంటున్నాయని అధికారులు తెలిపారు.

నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, ఆత్మకూరు, మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్లు, రేంజర్లు, ఇతర కిందిస్థాయి అధికారులు, సిబ్బంది పెద్దపులి అడుగు జాడలను గుర్తించారు. ఎక్కడైనా కన్పిస్తే పిల్లలను వాటి వద్దకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.తల్లి పులి జాడ తెలిసిందని  ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ పరిస్థితి మొదటికి రావడంతో నిరాశకు లోనయ్యారు. ఎలాగైనా గాలించి పిల్లలను తల్లి చెంతకు చేరుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

About Author