PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిడుగు పడి…ముగ్గురి మృతి

1 min read

– 32 మేకలూ మృత్యువాత
– అనాథలైన ముగ్గురు చిన్నారులు


పల్లెవెలుగు వెబ్​, హొళగుంద: కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని పెద్దహ్యాట గ్రామంలో ఓ కుటుంబంపై పిడుగు పడింది. ఒకే కుటుంబానికి చెందిన భార్యభర్తలు, ఒక కూతురు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. పెద్దహ్యాట గ్రామానికి చెందిన భోజరాజు (36),మల్లమ్మ (30)కు నలుగురు కూతుళ్లు. భోజరాజుకు నాలుగు ఎకరాల మెట్ట భూమి ఉంది. సోమవారం పెద్ద కూతురు హంసమ్మను ఇంటి దగ్గర ఉంచి… ముగ్గురు కూతుళ్లతో భార్యభర్తలు సాగు చేసేందుకు ట్రాక్టర్లను వెళ్లారు. తమతోపాటు మేకలను కూడా పొలానికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పొలంలోని వేపచెట్టు కిందకు సేద తీరేందుకు వెళ్లారు. చెట్టుపై పిడుగు పడటంతో భోజరాజు, మూడవ కూతురు రేవతి (8) అక్కడికక్కడే మృతి చెందారు. 32 మేకలు కూడా విగతజీవులయ్యాయి. మల్లమ్మ ఒడిలో ఉన్న చిన్నకూతురు పిడుగు పడిన వెంటనే విసిరిపడేయడంతో.. ఆ చిన్నారి క్షేమంగానే బయట పడింది. కాగా మల్లమ్మ, మరో కూతురు మల్లేశ్వరి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో హొళుగంద ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమించడంతో మల్లమ్మను ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ కోలుకోలేక మల్లమ్మ మృతి చెందింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిడుగు పాటుకు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. బంధువులు, గ్రామస్తులు కన్నీటిపర్యాంతమయ్యారు. విషయం తెలుసుకున్న హొళగుంద ఎస్​ఐ విజయ్​కుమార్​, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మృత్యుంజయురాలు.. వెన్నెల:
పేద కుటుంబంపై పిడుగు పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా… 32 మేకలు మృత్యువాత పడ్డాయి.తల్లి మల్లమ్మ ఒడిలో ఉన్న వెన్నెల పిడుగు పిడిన వెంటనే పక్కకు విసిరేసింది. దీంతో వెన్నెలకు ఎటువంటి గాయాలు కాలేదు. తండ్రి భోజరాజు, తల్లి మల్లమ్మ, మూడో కూతురు రేవతి మృతి చెందారు.దీంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

About Author