PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనంత‌పురంలో తొలిసారిగా  కండ‌రాల బ‌ల‌హీన‌త‌కు చికిత్స‌

1 min read

* ప్రాణాంత‌క‌మైన వ్యాధికి వైద్యం చేసిన కిమ్స్ స‌వీరా వైద్యులు

* ల‌క్ష మందిలో 2-5 కేసులు మాత్ర‌మే.. 30% మంది మ‌ర‌ణించే ప్రమాదం

పల్లెవెలుగు వెబ్  అనంత‌పురం : ప్రతి ల‌క్షమంది జనాభాలో కేవ‌లం 2 నుంచి 5 మాత్రమే వ‌చ్చే అత్యంత అరుదైన‌, అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌యాస్థెనియా గ్రెవిస్ అనే వ్యాధి కార‌ణంగా సంభ‌వించే కండ‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య వ‌ల్ల ఊపిరి అంద‌ని ప‌రిస్థితికి చేరుకున్న ఓ గృహిణికి అనంత‌పురంలోని కిమ్స్ స‌వీరా ఆస్పత్రి వైద్యులు విజ‌య‌వంతంగా చికిత్స చేసి, ప్రాణాపాయం నుంచి ర‌క్షించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్పత్రికి చెందిన సీనియ‌ర్ క‌న్సల్టెంట్ న్యూరాల‌జిస్టు డాక్టర్ కె. జాషువా కాలేబ్ వివ‌రించారు. “గుత్తి ప్రాంతానికి చెందిన సుజాత అనే 50 ఏళ్ల గృహిణికి రెండు సంవ‌త్సరాల క్రితం మ‌యాస్థెనియా గ్రెవిస్ వ్యాధి నిర్ధార‌ణ అయ్యింది. అప్పటి నుంచి క‌నీసం నెల‌- రెండు నెల‌లకు ఒక‌సారి ఆమె వైద్యుల‌ను సంప్రదిస్తూ త‌గిన మందులు వాడుతుండాలి. ఇది అత్యంత అరుదైన‌, ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధి. ల‌క్ష జ‌నాభాలో కేవ‌లం ఇద్ద‌రి నుంచి ఐదుగురికి మాత్రమే వ‌స్తుంది. దానికితోడు, ఈ వ్యాధి వ‌చ్చిన‌వారిలో దాదాపు 30 శాతం మంది మ‌ర‌ణించే ప్రమాదం కూడా ఉంటుంది. సుజాత‌కు మ‌యాస్థెనియా గ్రెవిస్ ఏసీహెచ్ఆర్  యాంటీబాడీ పాజిటివ్‌గా రెండేళ్ల క్రితం నిర్ధార‌ణ అయ్యింది. సాధార‌ణంగా ఈ వ్యాధి ఉన్నవారికి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకితే అప్పుడు ఊపిరితిత్తుల‌కు సంబంధించిన కండ‌రాలు బ‌ల‌హీన‌ప‌డ‌టంతో, ఊపిరి అంద‌ని ప‌రిస్థితి ఏర్పడుతుంది. దాన్ని వైద్య ప‌రిభాష‌లో మయస్తీనిక్ క్రైసిస్ అంటారు. ఇటీవ‌లే సుజాత‌కు వాంతులు, విరేచ‌నాలతో క‌డుపునొప్పి రావ‌డంతో ఆమెకు డ‌యేరియా ఇన్ఫెక్షన్ సోకింది. దానివ‌ల్ల మయస్తీనిక్ క్రైసిస్‌ ఏర్పడింది. అదేస‌మ‌యంలో ఆమెకు తీవ్రమైన జ్వరం కూడా ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆమెను అనంత‌పురంలోని కిమ్స్ స‌వీరా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ స‌మ‌స్య ఉన్న‌వారికి అన్నిర‌కాల మందులు కూడా ఇవ్వలేము. దానివ‌ల్ల వారికి నీర‌సం ఎక్కువైపోయి, ప‌రిస్థితి మ‌రింత విష‌మిస్తుంది.  ముందుగా ఇక్కడ‌కు వ‌చ్చేస‌రికి ఆమెకు ఆక్సిజ‌న్ స్థాయి (ఎస్‌పీఓ2) బాగా త‌గ్గిపోయి, 68%కు వ‌చ్చింది. దాంతో ఆమెను వెంటిలేట‌ర్ మీద పెట్టాం. త‌ర్వాత ఆమెకు చికిత్స చేయ‌డానికి ఉన్న అవ‌కాశాల‌ను బంధువుల‌తో చ‌ర్చించాం. ఆమెకు ఐవీ ఇమ్యునోగ్లోబులిన్‌లు అందించ‌డం లేదా ప్లాస్మా మార్పిడి చేయాలి. అందులో ప్లాస్మా మార్పిడి వ‌ల్ల ఈ త‌ర‌హా రోగుల‌కు కొన్ని ర‌కాల స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్రమాదం ఉండ‌టంతో వారు ఇమ్యునోగ్లోబులిన్‌ల వైపే వాళ్లు మొగ్గు చూపారు. దాంతో వాటితో పాటు త‌గిన యాంటీబ‌యాటిక్‌లు, చెస్ట్ ఫిజియోథెర‌పీ చేయ‌డంతో పాటు నాలుగు రోజుల పాటు వెంటిలేట‌ర్ మీద ఉంచాం. త‌ర్వాత వెంటిలేట‌ర్ తీసేయ‌గా, మ‌ళ్లీ ఎస్‌పీఓ2 త‌గ్గింది. దాంతో మ‌రో రెండు రోజులు ఆమెకు నాన్ ఇన్వేజివ్ వెంటిలేష‌న్ పెట్టి, స్టెరాయిడ్లు, ఇమ్యునోస‌ప్రెసెంట్లు, మ‌రికొన్ని మందులు ఇచ్చాం. ఆమె క్ర‌మంగా కోలుకున్నారు. గ‌ది వాతావ‌ర‌ణంలో ఆమెకు ఎస్‌పీఓ2 96%కు వ‌చ్చింది. దాంతో ఆమె కుటుంబ‌స‌భ్యులు, బంధువుల‌తో పాటు వైద్య‌బృందం అంతా ఊపిరి పీల్చుకుంది. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన, అరుదైన మ‌యెస్థెనియా గ్రెవిస్ వ్యాధికి తొలిసారిగా కిమ్స్ స‌వీరా ఆస్పత్రిలో చికిత్స చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎమ‌ర్జెన్సీ వైద్యనిపుణులు, ఐసీయూ వైద్యబృందం, న‌ర్సులు అంద‌రూ సుజాత‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకున్నారు. దాంతో ఆమె కోలుకుని డిశ్చార్జి అయ్యారు” అని డాక్టర్ జోషువా కాలేబ్ వివ‌రించారు.         

About Author