PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యూపీ టూ ఢిల్లీ.. మోదీ పై పోరుకు పీకే స్కెచ్ ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రధాని న‌రేంద్ర మోదీని గ‌ద్దె దించేందుకు ప్రశాంత్ కిషోర్ పక్కా ప్లానింగ్ తో అడుగులు వేస్తున్నారా ? అంటే అవున‌నే అంటున్నారు విశ్లేష‌కులు. ఇటీవ‌ల ఆయ‌న ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ తో రెండోసారి భేటీ అయ్యారు. దీంతో వారి అడుగులు ఎటువైపు అనే ప్రశ్నకు స‌మాధానం దొరికింది. త్వర‌లో ఉత్తర‌ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించాల‌ని ప్రశాంత్ కిషోర్ స్కెచ్ వేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ను పొలిటిక‌ల్ గ్రౌండ్ గా మార్చుకుని.. ప్రధాని పీఠం పై గురిపెట్టాల‌ని పీకే వ్యూహ‌ర‌చ‌న చేశారు. ఉత్తర ప్రదేశ్ బీజేపీకి బ‌ల‌మైన రాజ‌కీయ వేదిక. యూపీలో బీజేపీని దెబ్బకొడితే… కేంద్రంలో అధికారంలోకి రావాలంటే క‌ష్టంగా ఉంటుంది. న‌రేంద్ర మోదీ అధికారంలోకి రావ‌డానికి యూపీలో బీజేపీ గెలిచిన సీట్లు ఎంతో దోహ‌దం చేశాయి. దీంతో యూపీ నుంచే బీజేపీని దెబ్బకొడితే.. పార్లమెంట్ ఎన్నిక‌ల నాటికి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వాన్ని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌వ‌చ్చన్న ఆలోచ‌న‌లో పీకే ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం దేశంలో న‌రేంద్ర మోదీని వ్యతిరేకించే పార్టీలు, నాయ‌కుల‌తో పీకే స‌మావేశ‌మ‌వుతున్నారు.
యూపీ టూ ఢిల్లీ :
ఉత్తర‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు త్వర‌లో జ‌ర‌గనున్న నేప‌థ్యంలో శ‌ర‌ద్ ప‌వార్, తృణ‌మూల్ నేత‌, మాజీ కేంద్ర మంత్రి య‌శ్వంత్ సిన్హా లు సంయుక్తంగా ఒక స‌మావేశం నిర్వహిస్తున్నారు. ఈ స‌మావేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని యూపీ ఎన్నిక‌ల్లో ఎలా ఓడించాల‌నే అంశం మీద ప్రధానంగా చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. మొద‌ట మోదీ ప్రజా వ్యతిరేఖ నిర్ణయాల మీద పోరాటం మొద‌లుపెట్టి.. ఆ త‌ర్వాత మోదీని ఢీ కొట్టే నేత‌ను ఎన్నుకోవాల‌ని బీజేపీ వ్యతిరేఖ పార్టీలు యోచిస్తున్నాయి. ఈ స‌మావేశానికి ఎన్సీపీ, నేష‌న‌ల్ కాన్ఫరెన్స్ , సీపీఐ, ఆప్ తో పాటు 15 రాజ‌కీయ పార్టీలు హాజ‌ర‌వుతున్నాయి. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ వేదిక‌గా రాజ‌కీయాలు చేస్తున్న త‌రుణంలో మూడో ప్రత్యామ్నాయ శ‌క్తిని వేదిక మీద‌కి తీసుకురావాల‌నే ఆలోచ‌న‌లో పీకే ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఉత్తర‌ప్రదేశ్ ను వేదిక‌గా చేసుకుని పీకే వ్యూహ‌ర‌చ‌న మొద‌లెట్టారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నిక‌లు ఖ‌చ్చితంగా బీజేపీ ఫ్యూచ‌ర్ ని ప్రతిబింబిస్తాయ‌ని చెప్పడానికి ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు.

About Author