PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెలగమాను డ్యాం కాలువ నిర్మాణంపై పాలకులు దృష్టి పెట్టాలి    

1 min read

సర్వే పూర్తి అయి 18 సంవత్సరాలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మూడు సార్వత్రిక ఎన్నికలు అయిపోయి, నాలుగో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నా వెలగమాను డ్యాం కాలువ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వున్నదని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.గడివేముల మండలం  పెసరవాయి, కరిమద్దెల, గడివేముల రైతులతో కలిసి వెలగమాను డ్యాం దగ్గర రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక నాయకులతో కలిసి వెలగమాను డ్యాం, అలగనూరు రిజర్వాయర్ లను క్షేత్ర స్థాయి పరిశీలన చేసారు.ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..సుమారు 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ఈ పథకంపై అన్ని రాజకీయ పార్టీలు కార్యాచరణ చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.2005 లోనే అలగనూరు రిజర్వాయర్ నుండి వెలగమాను డ్యాం వరకు కాలువ నిర్మాణం కొరకు సర్వే పూర్తి అయి 18 సంవత్సరాలు అయినా ఇప్పటికీ కూడా కాలువ నిర్మాణంపై పాలకులు మనసు పెట్టలేదని ఆయన విమర్శించారు.సకాలంలో నీరందక రైతులు మానసిక వేదనకు, ఆందోళనలకు గురవుతున్నారనీ, ఈ కాలువ నిర్మాణం వలన దాదాపు 12  గ్రామాల పరిధిలోని 15 వేల ఎకరాలకు సాగునీరు లభించి ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా వుంటారని ఆయన తెలిపారు.అలగనూరు నుండి వెలగమాను డ్యాం వరకు కాలువ నిర్మాణం జరగడం వలన  నంద్యాల ప్రాంతంలోని కె సి కెనాల్ ఆయకట్టుకు నీరు సక్రమంగా అందడంతో పాటు, ఆళ్ళగడ్డ, కడప  ప్రాంతానికి నీటి పంపిణీ చేసే ప్రధాన కాలువ పైన ఒత్తిడి తగ్గుతుందని  ఆయన స్పష్టం చేశారు.ఈ విషయపై అధికారులు మరియు రాజకీయ పార్టీల నాయకులకు లేఖను వ్రాస్తామని ఆయన తెలిపారు.అలాగే 2017 నుండి ఇప్పటిదాకా కట్ట తెగి నిరుపయోగంగా వున్న అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తులను తక్షణమే చేపట్టి వచ్చే ఖరీఫ్ సీజన్ కు సాగునీరు అందించాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెసరవాయి సునీల్ రెడ్డి, దామోదర రెడ్డి, కరిమద్దెల ఈశ్వర్ రెడ్డి, శివారెడ్డి, గడివేముల సంజీవరెడ్డి, సంతజూటూరు లాయర్ క్రిష్ణారెడ్డి, కల్లూరు, చంద్రశేఖర్ రెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక నాయకులు రామకృష్ణారెడ్డి, డేవిడ్, శేషన్న లతో పాటు గడివేముల మండల రైతులు పాల్గొన్నారు.

About Author